Instructions on After FA-1 Exams - Remedial Teaching ESE02/567/2021

Instructions on After FA-1 Exams - Remedial Teaching ESE02/567/2021

File No.ESE02/567/2021-SCERT
 
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పాఠశాల విద్యాశాఖ
ఆర్ సి నం. ఇఎస్ ఇ 02/567/2021-ఎస్ సి ఇ ఆర్ టి/ 2021 తేది 6-11-2021

Instructions on After FA-1 Exams - Remedial Teaching ESE02/567/2021

విషయం : పాఠశాల విద్య, ఎస్.సి.ఇ.ఆర్.టి, ఆంధ్ర ప్రదేశ్-2021-22 విద్యాసంవత్సరానికి గాను నిర్మాణాత్మక పరీక్ష1 నిర్వహించిన తరువాత అమలు చేయవలసిన మరికొన్ని చర్యలు-ఆదేశములు ఇవ్వడం-గురించి., 
నిర్దేశం: 
ఈ కార్యా లయ మెమొ 151/ఎఐ/2021 తేది 8-9-2021 
2. అకడమిక్ కాలండర్ 2021-22 
3.ఈ కార్యా లయ ఉత్తర్వులు ఆర్ సి నం. ఇ ఎస్ ఇ 02/567/2021-ఎస్.సి.ఇ.ఆర్.టి/2021 తేది 24-9-2021 
4. ఈ కార్యాలయ ఉత్తర్వులు తేది 14-10-2021

2021-22 విద్యాసంవత్సరానికి గాను నిర్మాణాత్మక మూల్యాంకనం-1 ని నిర్వహించడానికిగాను ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది. ఆ విధంగా నిర్మాణాత్మక మూల్యాంకనం చేపట్టిన తరువాత ప్రతి పాఠశాల ప్రధానోపాధ్యుడు, ఆ పాఠశాలలోని అందరు ఉపాధ్యాయులు తప్పనిసరిగా ఈ కింది విధంగా చర్యలు తీసుకోవలసి ఉంటుంది. 

ఆన్సరు పేపర్లు మూల్యాంకనం చెయ్యడం, మార్కులు ఇవ్వడం 

2. అన్ని ఆన్సరు పేపర్లను సంబంధిత ఉపాధ్యయుడు దిద్ది ప్రతి పేపరులోనూ విద్యార్థి సాధించిన మార్కుల్ని విద్యార్థులకు తెలియపర్చాలి. 

తరగతి వారీ రాంకులిస్టులు తయారు చేయడం 
3. అన్ని సబ్జెక్టుల పేపర్లూ దిద్దిన తరువాత, తరగతి వారీగా విద్యార్థులు సాధించిన మార్కులతో తరగతివారీ రాంకులిస్టులు తయారు చేసి తరగతి గదిలో ప్రదర్శించాలి. 

వెనకబడ్డ విద్యార్థుల్ని గుర్తించడం, రెమెడియల్ శిక్షణ చేపట్టడం
 4. ప్రతి సబ్జెక్టులోనూ 35 శాతం కన్నా తక్కువ మార్కులు వచ్చిన విద్యార్థుల్ని గుర్తించి వారికి వెంటనే రెమెడియల్ శిక్షణ మొదలు పెట్టాలి. రెమెడియల్ క్లాసులు ప్రతిరోజూ ఉదయం 8 నుండి 9 గంటల దాకా గాని, లేదా సాయంకాలం 4 నుంచి 5 గంటలదాకా గాని చేపట్టాలి. ఎట్టిపరిస్థితుల్లోనూ రెగ్యులర్ పాఠశాల పనిగంటల్లో రెమెడియల్ తరగతులు చేపట్టరాదు. వెనకబడ్డ విద్యార్థులకి రెమెడియల్ శిక్షణ చేపట్టడం విద్యాహక్కు చట్టం సెక్షను 24 (డి) ప్రకారం ప్రతి ఒక్క ఉపాధ్యాయుడి మౌలిక బాధ్యత. 

రెమెడియల్ శిక్షణలో పద్ధతులు 
5. విద్యార్థులు ఎక్కువమంది ఏ పాఠంలో, ఏ అంశంలో ఎక్కువ వెనకబడుతున్నారో గుర్తించి ఆ అంశాల మీదనే ప్రత్యేక శిక్షణ చేపట్టాలి.

6. తరచు లేదా దీర్ఘకాలం పాటు బడికి హాజరుకాని విద్యార్థులు చదువులో వెనకబడతారు కాబట్టి వారిని గుర్తించి సంబంధిత క్లాసు టీచరు వారి పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలి. ఎవరేనా విద్యార్థి చాలా రోజుల తర్వాత బడికి వచ్చినప్పుడు అతడు బడికి రాని రోజుల్లో జరిగిన పాఠాల గురించీ, నోట్సుల గురించి తెలియచెప్పాలి. తోటి విద్యార్థుల సహాయంతో అతడు ఆ నోట్సులు రాసుకునేటట్టు చూడాలి. 

7. ప్రతి సారీ పరీక్ష పేపర్లు దిద్దిన తరువాత, ఆ పేపర్లను లేదా నోట్సులను విద్యార్థులకు తిరిగి ఇచ్చి, ప్రతి ఒక్క విద్యార్థి ఆ ప్రశ్న పత్రాన్ని ఈసారి పుస్తకం చూసి రాయడానికి ప్రోత్సహించండి. దానివల్ల విద్యార్థికి తాను ఎక్కడ ఏ ప్రశ్నకు సమాధానం తప్పుగా రాసాడో దాన్ని తిరిగి సరిదిద్దుకునే అవకాశం కలుగుతుంది. 

8. విద్యార్థులు తోటివిద్యార్థుల నుంచి ఎక్కువ నేర్చుకోగలుగుతారు. కాబట్టి చురకైన విద్యార్థుల ద్వారా పీర్ గ్రూప్ లెర్నింగ్ ని ప్రోత్సహించాలి. 

చిట్టచివరి విద్యార్థిని కూడా ముందుకు తీసుకురావడం అందరి బాధ్యత 
9. తరగతిలో చదువులో వెనకబడ్డ చిట్టచివరి విద్యార్థిని కూడా ముందుకు తీసుకురావడం అందరి బాధ్యత. రెమెడియల్ శిక్షణ ద్వారా అందరు విద్యార్థులు ఆ యూనిట్ ని క్షుణ్ణంగా అర్థం చేసుకున్నారని నిశ్చయమయ్యాకనే ఉపాధ్యాయుడు తరువాతి యూనిట్ బోధించాలి. సిలబస్ పూర్తి చేయడం కన్నా, అందరు విద్యార్థులు కనీస సామర్థ్యాలు సాధించేలా చూడటం ఎక్కువ ముఖ్యం. 

ప్రధానోపాధ్యాయుల సమీక్ష 
10. ప్రతి ఒక్క ప్రధానోపాధ్యాయుడు తన ఉపాధ్యాయ సిబ్బంది ఈ నిర్దేశాలను అమలు చేస్తున్నదీ లేనిదీ ప్రతి పదిహేను రోజులకు ఒకసారి సమీక్షించుకోవాలి. విద్యాశాఖాధికారుల సమీక్ష 

11. ఈ నిర్దేశాలను ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు అమలు చేస్తున్నదీ లేనిదీ మండల, డివిజనల్, జిల్లా విద్యాశాఖాధికారులు, ప్రాంతీయ సంయుక్త సంచాలకులు తమ సందర్శనల్లో పరిశీలించాలి, అలాగే ప్రతి నెలా సమీక్షించాలి.
Download Proceedings Copy