AIS Annual Information System - కొత్తగా అమల్లోకి ఏఐఎస్‌ ఆదాయపన్ను శాఖ (ఐటీ విభాగం)

ఇక ఆర్థిక వ్యవహారాల గుట్టు రట్టు.. కొత్తగా అమల్లోకి ఏఐఎస్‌ ఆదాయపన్ను శాఖ (ఐటీ విభాగం) పన్ను చెల్లింపుదారులకు సంబంధించి ‘వార్షిక సమాచార నివేదిక పత్రం’ (ఏఐఎస్‌)ను అమల్లోకి తీసుకొచ్చింది. ప్రతి పన్ను చెల్లింపుదారు ఒక ఆర్థిక సంవత్సరంలో నిర్వహించిన ముఖ్యమైన అన్ని ఆర్థిక లావాదేవీల సమాచారం ఇందులో పొందుపరిచి ఉంటుంది. ఇలా మొత్తం 46 రకాల ఆర్థిక లావాదేవీల వివరాలు నమోదవుతాయి. ‘‘ఏఐఎస్‌ అనేది సమాచార నివేదిక. వివిధ మార్గాల నుంచి వచ్చిన ఆదాయం వివరాలు ఉంటాయి.



AIS Annual Information System - కొత్తగా అమల్లోకి ఏఐఎస్‌ ఆదాయపన్ను శాఖ (ఐటీ విభాగం) 

  • ఆదాయపు పన్ను శాఖ డేగకన్ను!
  • బ్యాంకుల్లో నగదు జమలు
  • నగదు ఉపసంహరణలు
  • క్రెడిట్‌ కార్డు లావాదేవీలు
  • మూలధన లాభాలు
  • స్థిరాస్తి లావాదేవీలు
  • వ్యాపార ఆదాయం
  • ప్రభుత్వ లెక్కల్లోకి ఇకపై ప్రతి కీలక సమాచారం
ఆదాయపన్ను శాఖ (ఐటీ విభాగం) పన్ను చెల్లింపుదారులకు సంబంధించి ‘వార్షిక సమాచార నివేదిక పత్రం’ (ఏఐఎస్‌)ను అమల్లోకి తీసుకొచ్చింది. ప్రతి పన్ను చెల్లింపుదారు ఒక ఆర్థిక సంవత్సరంలో నిర్వహించిన ముఖ్యమైన అన్ని ఆర్థిక లావాదేవీల సమాచారం ఇందులో పొందుపరిచి ఉంటుంది. ఇలా మొత్తం 46 రకాల ఆర్థిక లావాదేవీల వివరాలు నమోదవుతాయి. ‘‘ఏఐఎస్‌ అనేది సమాచార నివేదిక. వివిధ మార్గాల నుంచి వచ్చిన ఆదాయం వివరాలు ఉంటాయి.

ఆ ఆదాయం నుంచి పన్ను (టీడీఎస్‌)ను వసూలు చేశారా? లేదా అన్న దానితో సంబంధం ఉండదు. ఏ పెట్టుబడి చేసినా వివరాలు ఇందులో ఉంటాయి’’ అని ఐటీఆర్‌ ఫైలింగ్‌ వెబ్‌సైట్‌ స్పష్టం చేస్తోంది. కనుక పన్ను చెల్లింపుదారులు ముఖ్యమైన ఆర్థిక లావాదేవీల పట్ల అప్రమత్తంగా వ్యవహరించాలి. ఫలానా లావాదేవీ వివరాలు ఐటీ శాఖకు తెలియదని అనుకోవద్దు. తర్వాత నోటీసు వస్తే సంజాయిషీ ఇచ్చుకునేందుకు కంగారుపడాల్సి రావచ్చు. ఏఐఎస్‌లో నమోదయ్యే ఆర్థిక లావాదేవీల వివరాలు చూద్దాం..

ఏఐఎస్‌ అంటే..?
పలు సంస్థలు (ప్రభుత్వ, ప్రైవేటు) పాన్‌ నంబర్‌ ఆధారంగా నమోదైన లావాదేవీల వివరాలను ఆదాయపన్ను శాఖకు నివేదించాల్సి ఉంటుంది. ఆ వివరాలతో కూడిన వార్షిక సమాచార పత్రమే ఇది. ఏఐఎస్‌ అన్నది సంక్షిప్త నామం. ప్రస్తుతం అమల్లో ఉన్న ఫామ్‌ 26ఏఎస్‌లో టీడీఎస్‌/టీసీఎస్, సంబంధిత ఆర్థిక సంవత్సరంలో పన్ను చెల్లింపుదారు స్వయంగా చేసిన చెల్లింపులు, ఆదాయపన్ను శాఖ నుంచి వచ్చిన రిఫండ్‌ వివరాలు ఉంటున్నాయి.

దీన్ని మరింత విస్తరించి పన్ను చెల్లింపుదారునకు సంబంధించిన సమగ్ర ఆర్థిక వివరాల సమాచారాన్ని పొందుపరిచే పత్రమే ఏఐఎస్‌. ఫామ్‌ 26ఏఎస్‌ స్థానంలో దీన్ని అమల్లోకి తీసుకురావాలన్నది ఆదాయపన్ను శాఖ ప్రణాళిక. సమగ్ర సమాచారం అందుబాటులో ఉండడం వల్ల పన్ను చెల్లింపుదారులకు రిటర్నులు దాఖలు సౌలభ్యంగా ఉంటుందని భావిస్తోంది. అదే సమయంలో పన్ను ఎగవేతలు కూడా తగ్గే అవకాశం ఉంటుంది. పైన చెప్పుకున్నట్టు ఏఐఎస్‌లో అన్ని వివరాలు కచ్చితంగా నమోదవుతాయా? అన్న ప్రశ్న రావచ్చు. కచ్చితంగా నమోదు కావాలనేమీ లేదు. ఆర్థిక లావాదేవీల వార్షిక నివేదికను నిబంధనలకు అనుగుణంగా ఆయా సంస్థలు ఏటా ఆదాయపన్ను శాఖకు ఫైల్‌ చేయాలి.

బ్యాంకులు, రిజిస్ట్రార్‌ కార్యాలయాలు, ప్రాంతీయ రవాణా కార్యాలయాలు (వాహన కొనుగోళ్ల సమాచారం), ఫారీన్‌ ఎక్ఛ్సేంజ్‌ డీలర్లు, స్టాక్‌ ఎక్ఛ్సేంజ్‌లు, ఫండ్స్, షేర్లు, డిబెంచర్లను జారీ చేసే కంపెనీలు, ఆర్‌బీఐ, పన్నును వసూలు చేసే వ్యక్తులు అందరూ ఈ వివరాలను ఐటీశాఖకు అందించాల్సి ఉంటుందని ముంబైకి చెందిన ట్యాక్స్‌ నిపుణుడుజైన్‌ తెలిపారు. అలా చేసినప్పుడే ఆ వివరాలు పన్ను చెల్లింపుదారుల ఏఐఎస్‌లో నమోదవుతాయి. అందుకే రిటర్నులు వేసే ముందు ఏఐఎస్‌ను ఒక్కసారి చూసుకున్న తర్వాతే ముందుకు వెళ్లాలని జైన్‌ సూచించారు. అప్పుడే పన్ను చెల్లింపుదారులు రిటర్నుల్లో పేర్కొనే సమాచారానికి, ఐఏఎస్‌లోని వివరాలకు సరిపోలకపోవడం అనే సమస్య ఎదురుకాదన్నారు. పాన్‌–ఆధార్‌ అనుసంధానం అమల్లోకి రావడం తెలిసిందే. కనుక పాన్, ఆధార్‌ ఆధారితంగా ఏ లావాదేవీ నిర్వహించినా దానిని ఐటీ శాఖ ట్రాక్‌ చేయగలదు.

► విదేశీ కరెన్సీ కొనుగోళ్లు
ఈక్విటీ షేర్లు, డెట్‌ సాధనాలు, రియల్‌ ఎస్టేట్‌ పెట్టుబడుల కోసం విదేశీ కరెన్సీని కొనుగోలు చేస్తే ఆ వివరాలు తెలుస్తాయి. విదేశాల్లో బ్యాంకు ఖాతా తెరిచినా ఏఐఎస్‌లో చేరిపోతుంది.

► విదేశీ ప్రయాణం
విదేశాల్లో వైద్య చికిత్స, విదేశీ విద్య కోసం లేదా విదేశీ పర్యటనలకు డాలర్లను కొనుగోలు చేసి ఉంటే ఆ వివరాలు ఏఐఎస్‌లో నమోదవుతాయి. విదేశీ పర్యటనకు టూరిజం ప్యాకేజీ తీసుకున్నా లేదా విదేశీ ప్రయాణానికి సంబంధించి చెల్లింపులు చేసినా ఆ వివరాలను ట్రావెల్‌ ఏజెన్సీలు ఐటీ శాఖకు కచ్చితంగా తెలియజేస్తాయి.

► స్థిరాస్తి కొనుగోళ్లు/విక్రయాలు
రూ.50 లక్షలకు మించి ఇల్లు విక్రయించిన సందర్భాల్లో కొనుగోలుదారు పన్నును మినహాయించి ఫామ్‌ ‘16బీ’ని విక్రయదారుకు జారీ చేస్తారు. కొనుగోలుదారు ఈ సమాచారంతో ఫామ్‌ 26క్యూబీని ఆదాయపన్ను శాఖకు దాఖలు చేయాల్సి ఉంటుంది. అలాగే, ఇల్లు, భూముల విక్రయం రూపంలో ఆదాయం అందుకుంటే, దానిపై అమలు చేసిన టీడీఎస్‌ వివరాలు ఆదాయపన్ను శాఖకు తెలుస్తాయి.

► ప్లాంట్‌/మెషినరీలపై అద్దె
ప్లాంట్, మెషినరీపై అద్దె అదా యం తీసుకుంటూ, ఆ మొత్తంపై 2 శాతం టీడీఎస్‌ను అమలు చేస్తే ఆ సమాచారం ఏఐఎస్‌కు వెళుతుంది.

► లాటరీ ఆదాయం
లాటరీ/క్రాస్‌వర్డ్‌ గెలుచుకుని ప్రైజ్‌మనీ పొందితే, దానిపై టీడీఎస్‌ అమలు చేస్తే ఆ వివరాలను ఫామ్‌ 16ఏ రూపంలో చెల్లించిన సంస్థ ఆదాయపన్ను శాఖకు తెలియజేస్తుంది. గుర్రపు పందేలు గెలుచుకున్న సందర్భాల్లో టీడీఎస్‌ మినహాయించినా ఏఐఎస్‌లో నమోదవుతుంది.

► బీమా కమీషన్‌
బీమా ఏజెంట్‌గా చేస్తూ, బీమా సంస్థ నుంచి కమీషన్‌ పొందితే ఆ వివరాలు ఏఐఎస్‌లో ప్రతిఫలిస్తాయి. ఎందుకంటే కమీషన్‌పై టీడీఎస్‌ అమలవుతుంది.

► వ్యాపార ఆదాయం
వ్యాపారం రూపంలో ఆదాయం, వ్యయాలూ ఏఐఎస్‌లో నమోదవుతాయి. వ్యాపారానికి సంబంధించే కమీషన్‌ లేదా బ్రోకరేజీ, వృత్తిపరమైన, సాంకేతిక ఫీజులు కూడా ఇందులో ఉంటాయి.

► లాటరీ టికెట్లపై కమీషన్‌
లాటరీ టికెట్ల విక్రయ రూపంలో అందుకునే కమీషన్‌ వివరాలు ఐటీ శాఖకు తెలు స్తాయి.

► క్రీడల రూపంలో ఆదాయం
క్రీడాకారులు, క్రీడా అసోసియేషన్లు అందుకునే ఆదాయం ఏఐఎస్‌లో నమోదవుతుంది.

► వాహన కొనుగోలు, విక్రయం
రూ.10 లక్షలకు మించి విలువైన వాహనాలను కొనుగోలు చేసినా, విక్రయించినా ఆ సందర్భంలో కొనుగోలుదారులు విక్రయదారులకు ఒక శాతం టీడీఎస్‌ చెల్లించాల్సి ఉంటుంది. అలాగే, వాహన కొనుగోలుకు రూ.2లక్షలకు మించి నగదు చెల్లింపులు చేసినా కానీ, టీడీఎస్‌ అమలవుతుంది. ఈ వివరాలే పాన్‌ నంబర్‌ ఆధారంగా వారి ఏఐఎస్‌లో నమోదవుతాయి.

► ఆఫ్‌ మార్కెట్‌ లావాదేవీలు
షేర్లు, సెక్యూరిటీలను ఆఫ్‌ మా ర్కెట్‌ (వ్యక్తి నుంచి వ్యక్తికి మధ్య) ద్వారా క్రయ, విక్రయాలు చేస్తే ఆ వివరాలు రిజిస్ట్రార్‌ అండ్‌ ట్రాన్స్‌ఫర్‌ ఏజెంట్ల ద్వారా ఐటీ శాఖకు చేరతాయి. దాంతో సంబంధిత వ్యక్తుల ఏఐఎస్‌లో నమోదవుతాయి.

► విదేశాల నుంచి జమలు/చెల్లింపులు
రాయల్టీ లేదా సాంకేతిక సేవల రూపంలో రాయల్టీ లేదా ఫీజులను స్థానికేతరులు (ప్రవాసులు/నాన్‌ రెసిడెంట్‌) అందుకుంటే ఆ వివరాలు ఏఐఎస్‌లో రికార్డు అవుతాయి. విదేశాలకు పంపించే, విదేశాల నుంచి స్వీకరించే చెల్లింపుల వివరాలు కూడా ఇందులోకి చేరతాయి. ప్రవాసులు ఎవరైనా భారతీయ కంపెనీ నుంచి వడ్డీ ఆదాయం అందుకున్నా, ఈ మొత్తంపై టీడీఎస్‌ అమలైనా ఏఐఎస్‌లో నమోదవుతుంది. గ్లోబల్‌ డిపాజిటరీ రిసిప్ట్‌ల (జీడీఆర్‌) రూపంలో ఆదాయం లభించినా ఏఐఎస్‌లో కనిపిస్తుంది.

► ప్రభుత్వ సెక్యూరిటీలు
ప్రభుత్వ బాండ్లు, సెక్యూరిటీల రూపంలో అందుకునే వడ్డీ పన్ను చెల్లింపుదారు ఆదాయంలో కలుస్తుంది. ఈ వివరాలు సైతం ఏఐఎస్‌లో చేరతాయి. ఒకవేళ దీనిపై టీడీఎస్‌ అమలు చేస్తే ఫామ్‌ 16ఏను జారీ చేస్తారు.

► ఇతర చెల్లింపులు
జీవిత బీమా ప్రీమియం, హోటల్‌ చెల్లింపులు, క్రెడిట్‌ కార్డు లావాదేవీలు తదితర సమాచారం కూడా ఆదాయపన్ను శాఖకు వెళుతుంది.

► వేతనం
సంస్థ నుంచి మీకు చెల్లించిన వేతనం, అందులోనుంచి పన్నును ఏమైనా వసూలు చేసి ఉంటే (టీడీఎస్‌) ఆ వివరాలు ఏఐఎస్‌లో నమోదవుతాయి. సంస్థ టాన్, ఉద్యోగి పాన్‌ వివరాలు కూడా ఉంటాయి. ఏఐఎస్‌లో పేర్కొనే మొత్తాన్ని స్థూల వేతనంగా అర్థం చేసుకోవాలి. ఇందులో అలవెన్స్‌లు కూడా కలిసే ఉంటాయి. పన్ను చెల్లింపుదారు రిటర్నులు దాఖలు చేయడం ద్వారా మినహాయింపులు, తగ్గింపు ప్రయోజనాలను పొందొచ్చు.

► అద్దె చెల్లింపులు
కిరాయిదారు మీకు చెల్లించుకున్న అద్దె వివరాలే కాదు.. మీరు కిరాయికి ఉంటూ చేసే అద్దె చెల్లింపుల వివరాలు సైతం ఏఐఎస్‌లోకి చేరతాయి. అయితే, టీడీఎస్‌ అమలు చేసినప్పుడే. రూ.50,000 అంతకుమించి నెలవారీ అద్దె చెల్లిస్తే 5 శాతం టీడీఎస్‌ తగ్గించి ఇవ్వాల్సి ఉంటుంది. అటువంటి సందర్భాల్లో వివరాలు వార్షిక సమాచార నివేదిక (ఏఐఎస్‌)లో నమోదవుతాయి. ఆయా అంశాల పట్ల అవగాహనతో వ్యవహరించడం అవసరం

► అద్దె ఆదాయం
మీ ఇంట్లో అద్దెకు ఉండే కిరాయిదారుకి మీ పాన్‌ నంబర్‌ ఇచ్చారంటే.. మీ అద్దె ఆదాయం వివరాలు ఏఐఎస్‌లో చేరిపోతాయి. సదరు కిరాయిదారు మీ పాన్‌ నంబర్‌ను పనిచేస్తున్న సంస్థకు ఇచ్చి పన్ను మినహాయింపు కోరొచ్చు. దాంతో మీ పాన్, అద్దె వివరాలు అక్కడి నుంచి ఐటీ విభాగానికి చేరతాయి. ప్రతి నెలా రూ.50,000, అంతకు మించి అద్దె ఆదాయం స్వీకరించిన సందర్భంలో.. భూమి, భవనం, మెషినరీ రూపంలో ఆదాయం అందుకుంటే ఆ వివరాలు నమోదవుతాయి. ఎందుకంటే ఈ ఆదాయంపై 10 శాతం టీడీఎస్‌ను అమలు చేయాలని ఆదాయపన్ను చట్టం నిర్ధేశిస్తోంది.

► అకౌంట్‌ బ్యాలన్స్‌
సేవింగ్స్‌ ఖాతా లేదా ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు కాకుండా ఇతర ఏ ఖాతాను తెరిచినా అది ఏఐఎస్‌లో ప్రతిఫలిస్తుంది. అంతేకాదు ఆర్థిక సంవత్సరం చివర్లో రూ.50,000కు మించి బ్యాలన్స్‌ ఉన్న బ్యాంకు ఖాతాల వివరాలు కూడా ఉంటాయి.

► డిపాజిట్లు/ ఉపసంహరణలు
బ్యాంకు ఖాతాల్లో (కరెంటు, సేవింగ్స్‌ తదితర) చేసిన నగదు జమల వివరాలు ఏఐఎస్‌లో కనిపిస్తాయి. నగదు డిపాజిట్ల వివరాలను పాన్‌
నంబర్‌ ఆధారంగా బ్యాంకులు, కోపరేటివ్‌ బ్యాంకులు, పోస్టాఫీసులు, ఎన్‌బీఎఫ్‌సీ సంస్థలు ఫామ్‌61ఏ రూపంలో ఐటీ శాఖకు తెలియజేయాల్సి ఉంటుంది.

► క్రెడిట్‌/డెబిట్‌కార్డ్‌
ఆర్థిక సంవత్సరంలో క్రెడిట్‌/డెబిట్‌ కార్డు మంజూరు చేసి ఉంటే ఆ వివరాలు నమోదవుతాయి.

► డివిడెండ్‌
ఈక్విటీ షేర్లు, ఫండ్స్‌ నుంచి పొందిన డివిడెండ్‌ వివరాలు ఉంటాయి. కంపెనీలు, మ్యూచువల్‌ ఫండ్స్‌ మీకు పంపిణీ చేసిన డివిడెండ్‌పై టీడీఎస్‌ వసూలు చేసి ఉంటే అది కూడా కనిపిస్తుంది.

► సేవింగ్స్‌ బ్యాంకు డిపాజిట్లపై వడ్డీ
సేవింగ్స్‌ ఖాతా డిపాజిట్లపై జమ చేసిన వడ్డీ వివరాలు కూడా నమోదవుతాయి. ఒక ఏడాదిలో వడ్డీ ఆదాయం రూ.10,000 వరకు ఉంటే సెక్షన్‌ 80టీటీఏ కింద పన్ను మినహాయింపు లభిస్తుంది. సీనియర్‌ సిటిజన్లు (60ఏళ్లకుపైన) అయితే టీటీబీ కింద రూ.50,000 ఆదాయంపై పన్ను లేకుండా చూసుకోవచ్చు.

► టైమ్‌ డిపాజిట్లు
టైమ్‌ డిపాజిట్లలో చేసిన పెట్టుబడుల వివరాలు ఏఐఎస్‌లో నమోదవుతాయి.
► ఫిక్స్‌డ్‌ డిపాజిట్లపై వడ్డీ ఆదాయం
ఫిక్స్‌డ్, రికరింగ్‌ డిపాజిట్ల రూపం లో పన్ను చెల్లింపుదారు అందుకున్న ఆదాయం వివరాలు ప్రతిఫలిస్తాయి. వీటిపై టీడీఎస్‌ అమలు చేస్తే ఆ వివరాలు సైతం కనిపిస్తాయి.

► సెక్యూరిటీలు, ఫండ్స్‌ కొనుగోళ్లు
షేర్లు, బాండ్లు, ఫండ్స్‌ యూనిట్లలో చేసే పెట్టుబడుల సమాచారా న్ని ఆయా సంస్థలు ఐటీ శాఖకు రిపోర్ట్‌ చేస్తాయి.

► ఇతర వనరుల ద్వారా వడ్డీ
సేవింగ్స్‌ ఖాతా, టర్మ్‌/ఫిక్స్‌డ్, రికరింగ్‌ డిపాజిట్లు కాకుండా ఇతర రూపాల్లో వడ్డీ ఆదాయం మీకు అందితే.. మీకు వడ్డీ చెల్లించిన సంస్థల నుంచి ఆదాయపన్ను శాఖకు సమాచారం వెళుతుంది.

► నగదు చెల్లింపులు
బ్యాంకు డ్రాఫ్ట్‌లు లేదా పేఆర్డర్లు లేదా పేచెక్‌లను కొనుగోలు చేసినా, వస్తు, సేవలకు నగదు రూపంలో చెల్లింపులు చేసినా ఏఐఎస్‌లో కనిపిస్తాయి. చట్టం కింద ఈ నగదు చెల్లింపుల లావాదేవీ వివరాలను తెలియజేయడాన్ని తప్పనిసరి చేశారు.

► పీఎఫ్‌ సొమ్ము ఉపసంహరించినా..
ప్రావిడెంట్‌ ఫండ్‌ ఖాతా నుంచి బ్యాలన్స్‌ను ఉపసంహరించుకుంటే కూడా ఏఐఎస్‌లో నమోదవుతాయి. ఐదేళ్ల పనికాలం పూర్తి కాకుండానే రూ.50,000కు మించి ఉపసంహరించుకుంటే టీడీఎస్‌ వసూలు చేస్తారన్నది గుర్తుంచుకోవాలి. ఐదేళ్లు నిండిన తర్వాత పన్ను ఉండదు.

► జీవిత బీమా
జీవిత బీమా పాలసీ రూపంలో లభించే ఆదాయానికి (మెచ్యూరిటీ తర్వాత/లేదా మరణ పరిహారం) ఆదాయపన్ను చట్టంలోని సెక్షన్‌ 10(10డి) కింద పన్ను మినహాయింపు ఉంటుంది. కొన్ని షరతులను పాటించినప్పుడే ఈ వెసులుబాటు. లేదంటే ఈ మొత్తం నుంచి టీడీఎస్‌ కోసేస్తారు. జీవిత బీమా పాలసీల నుంచి అందుకునే మొత్తం ఏఐఎస్‌లో నమోదవుతుంది.

► ఎన్‌ఎస్‌సీ ఉపసంహరణలు
నేషనల్‌ సేవింగ్స్‌ సర్టిఫికెట్‌ (ఎన్‌ఎస్‌సీ) నుంచి పెట్టుబడిని వెన క్కి తీసుకుంటే నమోదవుతాయి.

► పన్ను రిఫండ్‌పై వడ్డీ
ఆదాయపన్ను రిఫండ్‌ జాప్యం అయితే ప్రతీ నెలా 0.5 శాతం చొప్పున ఆ మొత్తంపై వడ్డీని పన్ను చెల్లింపుదారులకు ఐటీ చెల్లిస్తుంది. ఈ వివరాలు కూడా కనిపిస్తాయి. రిటర్నుల్లో ‘ఇన్‌కమ్‌ ఫ్రమ్‌ అదర్‌ సోర్సెస్‌’ విభాగంలో ఆదాయంగా దీన్ని పేర్కొనాలి.